ఎంతో వేగంగా స్టార్‌డమ్ తెచ్చుకున్నాడు.. అంతే వేగంగా అతని జీవితం ముగిసిపోయింది!
on Mar 30, 2024
సినీ పరిశ్రమలో బలవన్మరణానికి పాల్పడ్డవారు చాలా మంది ఉన్నారు. వారిలో హీరోయిన్లే ఎక్కువ కనిపిస్తారు. ఆత్మహత్య చేసుకున్న హీరోలను వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు. అలాంటి వారిలో ఉదయ్‌కిరణ్ ఒకరు. హీరోగా పరిచయమైన తక్కువ కాలంలో మంచి నటుడిగా పేరు తెచ్చుకోవడం, హీరోగా బిజీ అయిపోవడం, యూత్‌లో మంచి ఫాలోయింగ్ రావడం, అమ్మాయిల పాలిట డ్రీమ్‌బాయ్‌గా మారడం.. ఇలా అన్నీ చాలా వేగంగా జరిగిపోయాయి. అంతే వేగంగా అతని జీవితం కూడా ముగిసిపోవడం ఎంతో బాధాకరం. ఉదయ్‌కిరణ్ మరణవార్త విని బాధపడని వారు లేరు. అప్పట్లో ఈ వార్త ఇండస్ట్రీలోని వారితోపాటు సామాన్య ప్రేక్షకుల్ని కూడా కలచివేసింది. ఈ విషయం అతని అంతిమ యాత్రను చూస్తే అర్థమవుతుంది. ఎవరూ ఊహించని విధంగా వేలల్లో అభిమానులు ఉదయ్‌కిరణ్ అంతిమ యాత్రలో పాల్గొన్నారు.
ఉదయ్‌కిరణ్ గురించి చెప్పమని అతని సన్నిహితుల్ని అడిగితే తమకి ఉన్న అనుబంధం గురించి చెబుతారు, అతని మనస్తత్వం ఎలాంటిది అనే విషయం చెబుతారు. అన్నింటినీ మించి ఉదయ్‌కిరణ్ ఒక మంచి వ్యక్తి అనే మాట ప్రతి ఒక్కరూ చెబుతారు. అతనితో ఇండస్ట్రీలో ఎంతో మంది సన్నిహితంగా ఉండేవారు. వారిలో నటుడు, నిర్మాత మురళీమోహన్ ఒకరు. ఉదయ్‌కిరణ్‌ని చాలా దగ్గరగా చూసిన వ్యక్తిగా, ఒక శ్రేయోభిలాషిగా మురళీమోహన్ అతని గురించి ఏం చెప్పారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.
‘ఉదయ్‌కిరణ్ నన్ను తరచూ కలుస్తూ ఉండేవాడు. అతనికి హైపర్ టెన్షన్ ఉంది. ఏ విషయాన్ని సులువుగా తీసుకోలేడు. వెంటనే టెన్షన్ అయిపోతాడు. ఆ టైమ్‌లో కంట్రోల్‌లో ఉండడు. ఇది గమనించి అతనితో సన్నిహితంగా ఉండే మేము ఒక లేడీ డాక్టర్‌ని రిఫర్ చేశాం. దానికి సంబంధించిన కౌన్సిలింగ్ కోసం ఆ డాక్టర్ దగ్గర జాయిన్ చేశాం. ఆమె ఉదయ్‌ని సొంత తమ్ముడిలా ట్రీట్ చేసింది. టెన్షన్‌కి గురి కాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను అతనికి అర్థమయ్యేలా చెప్పింది. చెప్పినట్టే నడుచుకుంటానని అనేవాడు. కానీ, ఏదైనా సంఘటన అతన్ని డిస్ట్రబ్ చేస్తే మళ్ళీ ఆవేశపడిపోయేవాడు.
సినిమాల పరంగా అతనికి మంచి అవకాశాలే వచ్చేవి. వరస విజయాలు అందుకుంటూ హీరోగా మంచి పేరు తెచ్చుకున్నాడు ఉదయ్. ఇండస్ట్రీకి వచ్చి సక్సెస్ అయిన కొత్తవారిని స్వయంగా ఫోన్ చేసి అభినందించే అలవాటు చిరంజీవికి ఉంది. అలాగే ఉదయ్‌కి కూడా ఫోన్ చేసి అభినందించారు. ఆ సమయంలోనే ‘సార్.. మిమ్మల్ని ఒకసారి కలవాలి’ అని అడగడం, ఆ తర్వాత వెళ్లి కలవడం జరిగింది. ఆ పరిచయంతోనే చిరంజీవిని తరచూ కలిసేవాడు. తన లైఫ్‌లోని గుడ్ మూమెంట్‌ని చిరంజీవితో షేర్ చేసుకునేవాడు. దీంతో చిరంజీవికి ఉదయ్‌పై మంచి అభిప్రాయం కలిగింది. తమ ఫ్యామిలీలో కలుపుకుంటే బాగుంటుందనే ఆలోచన వచ్చింది. ఈ విషయాన్ని అల్లు అరవింద్‌తో డిస్కస్ చేసిన తర్వాత ఆ శుభవార్తని ఎనౌన్స్ చేశారు. అది తెలుసుకొని మేమంతా ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఉదయ్‌కిరణ్ లాంటి మంచి కుర్రాడు చిరంజీవిగారి ఫ్యామిలీతో కలవడం శుభసూచకంగా భావించాం. ఆ సమయంలోనే ఒకసారి మా ఇంటికి వచ్చాడు ఉదయ్. ‘ఇది నీ లైఫ్‌లో చాలా ఇంపార్టెంట్ మూమెంట్. మంచి సంబంధం. జాగ్రత్తగా చూసుకో’ అని సలహా ఇచ్చాను. కారణం తెలీదుగానీ, ఈ సంబంధం క్యాన్సిల్ అయిపోయింది. ఈ విషయంలో ఉదయ్ బాగా అప్‌సెట్ అయ్యాడు. అది అతని కెరీర్‌పై ప్రభావం చూపింది. ఆ తర్వాత అతను చేసిన సినిమాలు చాలా వరకు ఆడలేదు. వీటన్నింటివల్ల అతనికి టెన్షన్ మరింత పెరిగిపోయింది. అప్పటికే హైపర్ టెన్షన్‌తో బాధపడుతున్న ఉదయ్ దానివల్లే అలాంటి నిర్ణయం తీసుకున్నాడేమో. అతని మరణవార్త విని మా కుటుంబంలోని సభ్యుడ్ని కోల్పోయాను అన్నంత బాధ పడ్డాను. అది తలుచుకుంటే ఇప్పటికీ నాకు బాధ కలుగుతుంది’ అన్నారు మురళీమోహన్.
Also Read